Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

మానస పూజావిధానం

నానావికారభాజనమైన సృష్టికి మూలద్రవ్యములు పంచభూతములు. ఆ భూతములను పంచేంద్రియములచే మనం గుర్తిస్తున్నాము. నాలుకవల్ల రసాన్ని, ముక్కువల్ల గంథాన్ని, చెవివల్ల శబ్దమును దానియందలి నాదస్వర శ్రుతిభేదాలను కంటివల్ల రూపవర్ణములను- ఇలా ఒక్కొక్క ఇంద్రియంవల్ల ఒక్కొక్క అనుభవం కలుగుతున్నది. ఈశబ్దస్పర్శరూపరస గంధములవలన బాహ్యప్రపంచాన్ని తెలిసికోగలుగుతున్నాం. వీనిలో జిహ్వ - కర్మేంద్రియము, జ్ఞానేంద్రియము కూడాను. దానిచే రుచిని గ్రహించుటేగాక మాటలాడగలుగుతున్నాము. కన్ను-వస్తువులరంగును, సంఖ్యను, పరిమాణమును గూడా గుర్తిస్తుంది. స్పర్శేంద్రియముచే వస్తురూపాన్ని, పరిమాణాన్ని సంఖ్యనుగూడా తెలుసుకుంటున్నాము. ఈ శబ్ద స్పర్శాదులు పృథ్వ్యాది భూతములనాశ్రయించికొనివుంటవి. పృథ్వియందు గంధము, నీటి యందు రసము, తేజస్సునందు రూపము, వాయువు నందు స్పర్శము, ఆకాశమునందు శబ్దము-ఈ విధంగా ఈ భూతములకు మళ్ళా అధిదేవతలుండి, వాటి కాయాస్వభావాలను, శక్తిని కలిగిస్తారు. ఆ దేవతలు పరమాత్మయొక్క అభివ్యక్తులు. ఈ విధంగా పరమాత్మయే నానారూప గుణాత్మకమైన సృష్టిగా అభివ్యక్తమవుతున్నది.

ఈ ఇంద్రియాలలో ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క విధమైన సౌఖ్యము మనకు లభిస్తూంటుంది. సుందర రూపాలను చూడటంవల్లను, రుచియైన పదార్థాలను, భుజించుటవల్లను, సుగంధ ద్రవ్యాలను వాసనచూడటంవల్లను, మధురమైన సంగీతాన్ని వినడంవల్లను, మెత్తని వెచ్చని పదార్థాలను తాకుట వల్లను-ఇలా ఇంద్రియ పంచకముచే మనకు సంతోషం కలుగుతూ వుంటుంది. మన మలా సంతోషాన్ని, సౌఖ్యాన్ని అనుభవించేటపుడు ఈ భూతములు, వానిగుణములు, ఆగుణాలను గ్రహించే ఇంద్రియాలు-ఈ సమస్తము ఆ పరమేశ్వరుని అభివ్యక్తులు కదా. ఈ సృష్టియంతా ఆయీశ్వరమయంకదా అని స్మరిస్తూఉండాలి. మనపంచేంద్రియాలకుఇలాసౌఖ్యాన్ని కల్పిస్తున్న ఈ వస్తుజాతాన్ని మళ్ళా ఆ పరమేశ్వరునికే అర్పించాలి. అలా ఈశ్వరార్పితమైన పదార్థాలను తత్ప్రసాదంగా మనం మళ్ళీ స్వీకరించి అనుభవించాలి. ఇలా పంచేంద్రియ సౌఖ్యానికి కారణభూతములైన వస్తువులను ఈశ్వరున కర్పించడాన్ని పంచోపచారములంటారు. మనం ఇష్టదైవాన్ని జపిస్తూ మానసపూజ చేసే సమయమందు ఈ పంచోపచారములను నెరపుతూవుంటాము. మనచేతివ్రేళ్లు అయిదూ అయిదువిధాల ఉపచారాల కుపయోగిస్తాము.

వృధ్వ్యాత్మనే గంధం సమర్పయామి

వాయ్వాత్మనే ధూపం దర్శయామి

అగ్న్యాత్మనే దీపం దర్శయామి

ఆకాశాత్మనే పుష్పాణి సమర్పయామి

అమృతాత్మనే నైవేద్యం సమర్పయామి

అంటూ ఈ విధంగా-ఇట్లు జ్ఞానేంద్రియపంచకాన్ని, వాని అనుభవానికి మూలమైన భూతజాతాన్ని భక్తిపూర్వకంగా పరమాత్మ కర్పించి, తిరిగి వానిని తత్ప్రసాదంగా స్వీకరించినట్లయితే-ఇక ఆ ద్రవ్యాలను, ఇంద్రియాలను పాపకార్యములకోసం ఉపయోగించడమనేదివుండదు. పిమ్మట వానిని పరమార్ధప్రాప్తికైవినియోగిస్తూ పుణ్యాన్ని ఆర్జించుకొంటాం.

ఇంద్రియద్వారాన ఆనందంకూర్చే యీ రూప రస గంధాది సూక్ష్మగుణములేగాక గృహారామ వస్తువాహనాది స్ధూలపదార్ధాలుకూడా మనకు సంతోషాన్నిస్తున్నవి. వీనిని గూడ ఈశ్వరున కర్పించి పిమ్మటనే మనం అనుభవించవలసి వుంటుంది. అలా అర్పించటాన్నే షోడశోపచారములంటారు. అట్లేసంగీత నృత్యాది భోగాలను సహితం స్వామి కర్పించిన పిమ్మటనే మనం అనుభవించాలి. వాటినే చతుషష్టి ఉపచారము లంటాము.

ఈ ఉపచారపరంపరనే పూజా విధానమంటారు. అయితే ఈశ్వరపూజ కింత ఆడంబర మెందుకు? ఊరకే మనసా ధ్యానిస్తే చాలదా? అని అడగవచ్చు. నిజమేకాని, మనకు సౌఖ్యాన్ని ఇస్తున్న ఈ పదార్థములన్నీ ఈశ్వరునివల్లనేపుట్టినవనీ, ఈశ్వరమయములనీ నమ్ముతాడు భక్తుడు. ఆవిశ్వాసమువల్లనే సౌఖ్యకరములైన ఆ పదార్థాలన్నిటికి దాతయైన స్వామికే వాటిని భక్తితో నివేదించి, తిరిగి వాటిని స్వామిప్రసాదంగాస్వీకరించటంలో ఎంతో కృతజ్ఞతా, వినయము, విశ్వాసము ఇమిడివున్నవని గ్రహించాలి. భక్తుడు శుచియైన సత్పదార్థాన్ని ఈశ్వరున కర్పిస్తాడు. అట్లు నివేదితంకాని దేది తాను అనుభవించడు. ఈ అర్చనావిధానంవల్ల భక్తునకు సత్పదార్థసేవనం, సదాచరణం అలవడి అతడు సుచరిత్రుడూ, సువ్రతుడూ, పవిత్రుడూ ఔతాడు.

ఈశ్వరపాదనివేదితమైన ఇంద్రియార్థమే మనకు పరమసౌఖ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది మూక మహాకవి ఆర్యాశతకంలోకామాక్షీదేవితో ఏమంటున్నాడో చూడండి.

లీయే పురహర జాయే

మాయే తవ తరుణ వల్ల వచ్ఛాయే |

చరణ చం ద్రాభరణ

కాంచీశరణ నతార్తి సహరణ ||

''తల్లీ! లేజిగుళ్ళవంటి నీపాదముల మరుగుజొచ్చిన వారికి సకలార్తులు హరిస్త'' వని స్తుతిస్తున్నాడు. తిరనావుక్కరసు నాయనారనే భక్తుడుకూడ -

''మచ్చలేని వీణ, మలయానిలము, సంజ

చందమామ, నడు వసంతవేళ,

ముసురు తేటిపిండు, మొరయు సరస్సు, నా

కఖిలలోకనాథు నడుగు నీడ''

అన్నాడు, తాను సంసారాగ్ని తప్తుడైనప్పటికీ ఈశ్వర చరణములు శరణుజొచ్చుటవలన తన యింద్రియగ్రామము సంగీత మలయానిల చంద్రాతప భృంగ ఘుంకారాది పరమ సుఖానుభవాన్ని పొందుతున్నవంటున్నాడు. ఇలా పంచేంద్రియ తర్పణం కలుగుతున్నదని చెప్పినా, సరసీమధ్యమందున్న పద్మమందలి మకరందాన్ని తుమ్మెదలకే చూరవిడిచి తాను మాత్రం వాటి ఆనందాన్నే తనఆనందంగా ఎంచుకొంటున్నాడు. ఎదుటి వారిని సంతోషపెట్టి ఆ సంతోషమేతమదిగా ఎంచుకునే ధన్యు లిట్టివారేగదా!

కాబట్టి మన సకల సౌఖ్యములకు మూలం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వురుడై పరమసుఖనిధానం, సకలమునుస్వామి పాదములం దర్పించినవారి సౌఖ్యమును, యోగక్షేమాలను ఆ స్వామియే చూచుకుంటాడు. పంచోపచార పూర్వకమైనా మానసపూజా విధానమందు స్వామిని వివిధ పదార్థములచే అర్చించేవారు, ఆ స్వామియే సకల సౌఖ్యప్రదాతయనే విశ్వాసంతో చేస్తారు.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page